ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్ లైన్ గా ఖతార్ ఎయిర్ వేస్ నిలిచింది. ఇది వరసగా ఏడవ సారి ఖతార్ ఎయిర్ వేస్ ఈ జాబితాలో తొలి స్థానంలో నిలవటం. స్కై ట్రాక్స్ 2022 సంవత్సరానికి గాను తాజాగా ప్రపంచంలోని 20 అత్యుత్తమ ఎయిర్ లైన్స్ జాబితాను విడుదల చేసింది. ఇందులో భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక ఎయిర్ లైన్స్ విస్తారా కావటం విశేషం. విస్తారా ఎయిర్ లైన్స్ ను టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్ లైన్స్ ల సంయుక్తంగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే విస్తారా ఎయిర్ లైన్స్ ఈ జాబితాలో 20వ స్థానంలో ఉంది. అదే సమయంలో భారత్ లో అత్యుత్తమ ఎయిర్ లైన్ గా నిలవటంతో పాటు..బెస్ట్ ఎయిర్ లైన్ స్టాఫ్ అవార్డును కూడా దక్కించుకుంది.
ఖతార్ ఎయిర్ వేస్ ప్రపంచ అత్యుత్తమ ఎయిర్ లైన్ అవార్డుతోపాటు ఏకంగా మరో ఎనిమిది విభాగాల్లో బెస్ట్ బిజినెస్ క్లాస్, బెస్ట్ బిజినెస్ క్లాస్ లాంజ్ వంటి వాటిలో లోనూ మొదటి స్థానంలో ఉంది. 2021 సెప్టెంబర్ నుంచి 2022 ఆగస్టు వరకూ ఏకంగా వంద దేశాల్లో సర్వే చేసి..1.40 కోట్ల మంది నుంచి అభిప్రాయాలను తీసుకుని ఈ జాబితా రూపొందించింది స్క్రైట్రాక్స్. దీని ప్రకారం ప్రపంచంలోని టాప్ టెన్ ఎయిర్ లైన్స్ జాబితా ఇలా ఉంది. మొదటి స్థానంలో ఖతార్ ఎయిర్ వేస్ ఉండగా..రెండవ స్థానంలో సింగపూర్ ఎయిర్ లైన్స్, మూడవ స్థానంలో ఎమిరేట్స్, ఆ తర్వాత వరసగా ఆల్ నిప్పన్ ఎయిర్ వేస్, క్వాంటాస్ ఎయిర్ వేస్, జపాన్ ఎయిర్ లైన్స్, టర్కిష్ ఎయిర్ లైన్స్, ఎయిర్ ఫ్రాన్స్, కొరియన్ ఎయిర్, స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ఉన్నాయి.