వాయిదాల పద్దతి ఉంది దేనికైనా. మొబైల్ ఫోన్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి వస్తువు ఇప్పుడు ఈఎంఐల కింద అందుబాటులో ఉంటున్నాయి. తాము కోరుకున్న వస్తువును ఒకేసారి వేల రూపాయలు ఖర్చు పెట్టి కొనుగోలు చేయలేని వారికి ఈ విధానం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాదు...ఆయా సంస్థల వ్యాపారం కూడా గణనీయంగా పెరుగుతుంది ఈ పద్దతిలో. ఇప్పటికే విదేశీ పర్యటనలకు ట్రావెల్ ఏజెన్సీలు ఈఎంఐ పద్దతి కింద ఆఫర్లు ఇస్తున్నాయి. ఇది ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇప్పుడు దేశంలోని ప్రముఖ చౌకధరల ఎయిర్ లైన్స్ స్పైస్ జెట్ తన విమాన టిక్కెట్లను ఈఎంఐ పద్దతిలో అందించనున్నట్లు ప్రకటించింది. స్పైస్ జెట్ టిక్కెట్లను మూడు, ఆరు, పన్నెండు నెలల వాయిదాలో చెల్లించవచ్చని కంపెనీ వెల్లడించింది.
ఈ ఆఫర్ కింద టిక్కెట్లు కొనుగోలు చేయాలనుకునే వారు వన్ టైమ్ పాస్ట్ వర్డ్ (ఓటీపీ) కోసం పాన్, ఆధార్ వంటి వివరాలు ఎయిర్ లైన్స్ కు అందించాల్సి ఉంటుంది. ప్రయాణికులు ఏకీకృత చెల్లింపు విధానం (యూపీఐ) కింద తొలి ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. ప్రయాణికులు ఎంచుకున్న ఆప్షన్ ప్రకారం అదే యూపీఐ నుంచి వాయిదాలు కట్ అవుతూ పోతాయి. దీనికి క్రెడిట్, డెబిట్ కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఒక్క సారి అయినా విమానంలో ప్రయాణించాలి అని కలలు కనే వారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. దేశ జనాభాలో విమాన ప్రయాణికుల వాటా కేవలం ఇంకా కేవలం ఐదారు శాతంలోపే ఉంటుంది. దేశ జనాభాలో కనీసం సగం మంది అయినా ఒక్కసారి విమానం ఎక్కాలనుకుంటే ఇప్పుడు ఉన్న మౌలికవసతులు ఏ మాత్రం సరిపోవు.