పర్యాటకులకు గుడ్ న్యూస్. థాయ్ లాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి క్వారంటైన్ ఫ్రీ ట్రావెల్ ను అనుమతించనుంది. అయితే ఆ దేశాన్ని సందర్శించే వారు వ్యాక్సినేషన్ ను పూర్తి చేసుకుని ఉండాలి. ఫిబ్రవరి 1 నుంచి క్వారంటైన్ ఫ్రీ ట్రావెల్ ను అనుమతించాలని థాయ్ ల్యాండ్ నిర్ణయించింది. ప్రముఖ పర్యాటక దేశం అయిన థాయ్ లాండ్ గత ఏడాదే ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న కారణంగా ఈ పద్దతికి స్వస్తి పలికింది. ఇప్పుడు కేసులు తగ్గుముఖం పడుతుండటం, ఆస్పత్రుల్లో చేరికలు కూడా పరిమితంగా ఉండటంతో పర్యాటక రంగాన్ని గాడిన పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. టెస్ట్ అండ్ గో స్కీమ్ కింద పర్యాటకులను అనుమతించనున్నారు. థాయ్ లాండ్ కు వెళ్ళిన తొలి రోజుతోపాటు ఐదవ రోజు కూడా పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. పరీక్షల ఫలితాలు వచ్చే వరకూ హోటల్ లో ఉండాలి.
నిబంధనలు పాటించేందుకు వీలుగా ప్రయాణికులు ట్రాకింగ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అదే సమయంలో సమస్యలో కూరుకుపోయిన పర్యాటక రంగాన్ని గాడిన పెట్టేందుకు వీలుగా పర్యాటకుల నుంచి అదనంగా భారతీయ కరెన్సీలో 600 రూపాయల వరకూ వసూలు చేయాలని గతంలోనే ప్రతిపాదించారు. ఈ మొత్తం టిక్కెట్ ధరలోనే జత చేయనున్నారు. ఇది అంతా కూడా కరోనా పరీక్షలతో పాటు ఇతర అవసరాలకు ఉపయోగించనున్నారు. థాయ్ ల్యాండ్ పర్యాటక మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం 2022లో సుమారు 50 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. కరోనా ముందు నాటికి పరిస్థితులతో పోలిస్తే ఇది చాలా తక్కువ.