మంచుకొండల్లో విహారం. చాలా మంది ఇష్టపడే టూర్. ముఖ్యంగా పిల్లలకు అయితే ఆ సరదానే వేరు. పిల్లల కోసం పెద్దలు కూడా ఆ బాట పట్టాల్సిందే. దేశంలో అలాంటి అందమైన మంచుకొండల్లో విహరించాలంటే కాశ్మీర్ లోని గుల్ మార్గ్, పహల్ గామ్ ప్రాంతాలకు వెళ్లాల్సిందే. పర్యాటకులు ఈ శీతాకాల సీజన్ ను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు. కొంత మంది కరోనా భయంతో బయటకు వెళ్ళటానికి ఏ మాత్రం ఆసక్తి చూపటం లేదు. మరి కొంత మంది అయితే ప్రకృతి అస్వాదనకే పెద్ద పీట వేస్తున్నారు.
అందుకే గుల్ మార్గ్, పహల్ గామ్ ప్రాంతాల్లో హోటళ్ళు, రిసార్ట్ లు అన్నీ కూడా పూర్తిగా బుక్ అయిపోయినట్లు సమాచారం. గుల్ మార్గ్ లో అత్యంత ఖరీదైన రిసార్ట్ లు కూడా 2021 జనవరి నెలాఖరు వరకూ పూర్తిగా బుక్ అయిపోయాయి. ప్రతి రోజూ ఈ ప్రాంతానికి సుమారు 800 మంది పర్యాటకులు వస్తున్నట్లు అంచనా. తాజాగా కురుస్తున్న మంచు వర్షం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పర్యాటకు లు ముఖ్యంగా రోప్ వే టూర్ తో ఎంజాయ్ చేస్తున్నారు.