దేశీయంగా విమానయానం జోరు పెరుగుతోంది. మంగళవారం నుంచి ముంబయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రోజుకు వంద విమానాలు నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇప్పటివరకూ కేవలం 25 విమానాల టేకాఫ్..25 విమానాల ల్యాండింగ్ మాత్రమే జరిగింది. ఇది ఇప్పుడు రెట్టింపు కానుంది. మంగళవారం నుంచి 50 విమానాల టేకాఫ్, 50 విమానాల ల్యాండింగ్ కు అనుమతి లభించింది. దేశీయంగా విమాన సర్వీసులు ప్రారంభం అయినా కూడా సంఖ్య విషయంలో పలు ఆంక్షలు నెలకొన్న విషయం తెలిసిందే.
తాజా నిర్ణయంతో ముంబయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పలు కొత్త సెక్టార్లకు కూడా సర్వీసులు ప్రారంభం కానున్నాయి. మహారాష్ట్రలో కరోనా వైరస్ దేశంలోనే అత్యధికంగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం విమానాల రాకపోకలకు సంబంధించిన అంశంపై కూడా ఆంక్షలు విధించింది. ఇప్పుడు మెల్లమెల్లగా సడలింపులు ఇస్తూ పోతున్నారు. దేశంలోని పలు విమానాశ్రయాల్లో కూడా విమాన సర్వీసులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మే 25 నుంచి దేశంలో విమాన సర్వీసులు ప్రారంభించిన విషయం తెలిసిందే.