షాకింగ్. ఓ మహిళ ఎవరూ చేయని సాహసం చేసింది. విమానంలో బాగా వేడిగా ఉందని ఏకంగా అత్యవసర ద్వారం తెరిచి విమానం రెక్కపైకి ఎక్కింది. ఇది చూసిన వారంతా షాక్ కు గురయ్యారు. ఈ ఘటన ఉక్రెయిన్ లోని కీవ్ విమానాశ్రయంలో జరిగింది. రెక్కపైకి ఎక్కిన మహిళ తర్వాత అక్కడ నుంచి క్యాబిన్ లోకి ప్రవేశించింది. ఈ ఘటనతో సదరు మహిళను ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ తమ విమానాల్లో ఇక ప్రయాణానికి అనుమతించబోమని ప్రకటించింది. విమానం ల్యాండ్ అయిన సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. విమానం నుంచి దిగాల్సిన ప్రయాణికులు చాలా మంది ఉండటం..విమానం లోపల వేడి అధికంగా ఉండటంతో మహిళ ఈ చర్యకు పాల్పడింది.
ఇద్దరు పిల్లలతో కలసి ప్రయాణిస్తూ ఆ మహిళ ఈ పని చేయటంతో లోపల ఉన్న ప్రయాణికులు అందరూ కూడా షాక్ కు గురయ్యారు. ఈ పరిణామం చూసిన వెంటనే పైలట్ అంబులెన్స్ తోపాటు పోలీసులను కూడా సమాచారం ఇఛ్చారు. పోలీసులు సదరు మహిళను ప్రశ్నించగా..ఇలా చేయటానికి ఎలాంటి కారణాలు చెప్పలేదు. అయితే వైద్య పరీక్షల్లో మాత్రం ఆమె ఆల్కహాల్ లేదా డ్రగ్స్ తీసుకున్నట్లు తేలలేదు. అయితే ఈ తరహా చర్యలు గతంలో ఎన్నడూ చూడలేదని ప్రయాణికులు వ్యాఖ్యానించారు. టర్కీలో హాలిడేస్ పూర్తి చేసుకుని వెనక్కి వస్తూ ఆమె ఈ దుస్సాహాసానికి పాల్పడింది.