నీలి సముద్రం. అందులో నీలం రంగు తిమింగలం. వందేళ్లలో మూడుసార్లు మాత్రమే కన్పించే అరుదైన దృశ్యం. ఆ తిమింగలం బరువు లక్ష కిలోలు. పొడవు 82 అడుగులు. అంతే కాదు..ఇది భూ ప్రపంచంలోనే ఉన్న అతి పెద్ద జంతువు. ఈ అరుదైన దృశ్యం ఎక్కడ ఆవిష్కృతం అయిందో తెలుసా?. ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని సముద్రతీరంలో. ఈ అద్భుతమైన ఫోటోను తీసిన ఫోటోగ్రాఫర్ సీన్ కె కూడా తాను జాక్ పాట్ కొట్టేసినట్లు చెబుతున్నారు. వైల్డ్ లైఫ్ అధికారులు ఈ సముద్ర జంతువు వివరాలను వెల్లడించారు. బీచ్ టౌన్ మరోబ్రా వద్ద ఇది ఫోటోగ్రాఫర్ కెమెరాకు చిక్కింది.
సహజంగా నీలం తిమింగలాలు సముద్రంలో చాలా దూరంలో తిరుగుతూ ఉంటాయి. అందుకే సహజంగా ఇవి పెద్దగా కన్పించవు అని అధికారులు తెలిపారు. తిమింగలాలు ఎక్కడెక్కడో చెల్లాచెదురుగా ఉంటాయని..ఇవి ఒక ప్రాంతంలో ఉంటాయని చెప్పటం కష్టం అని వైల్డ్ లైఫ్ అధికారులు వెల్లడించారు. ఈ ఫోటోను తీసిన తర్వాత తన ఆనందానికి అవధులు లేవని..నోట మాటరాలేదని సిడ్నీకి చెందిన ఫోటోగ్రాఫర్ సీన్ కె నీలం తిమింగలం ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ కామెంట్ చేశారు.